Benefits of Unpolished rice: ‘దంపుడు’ బియ్యం వల్ల లాభాలు తెలుసా? - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Tuesday, February 15, 2022

Benefits of Unpolished rice: ‘దంపుడు’ బియ్యం వల్ల లాభాలు తెలుసా?

Benefits of Unpolished rice: ‘దంపుడు’ బియ్యం వల్ల లాభాలు తెలుసా?

 Benefits of Unpolished rice: ‘దంపుడు’ బియ్యం వల్ల లాభాలు తెలుసా?

బియ్యం అనగానే మనకిప్పుడు బాగా పాలిష్‌ పట్టిన తెల్లటి బియ్యమే గుర్తుకొస్తాయి. కానీ ఒకప్పుడు దంపుడు బియ్యమే తినేవారు. చూడ్డానికి దుమ్ము పట్టినట్టుగా, ముదురు రంగులో కనిపిస్తుండొచ్చు గానీ.. నిజానికివి మంచి పోషకాల గనులు. వరి పొట్టు కింద ఉండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. పాలిష్‌ పట్టినపుడు తవుడుతో పాటు ఇవన్నీ తొలగి పోతాయి. అందుకే తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మంచివని పరిశోధకులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు.


వారానికి ఐదు, అంతకన్నా ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవటం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతున్నట్టు హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు గుర్తించారు. తెల్లబియ్యాన్ని 50 గ్రాములు తగ్గించి, వాటి స్థానంలో దంపుడు బియ్యాన్ని చేర్చుకుంటే మధుమేహం ముప్పు 16% వరకు తగ్గుతున్నట్టు తేలింది కూడా.


అంతేకాదు, రక్తపోటు పెరగటానికి దోహదం చేసే సోడియం పాళ్లు కూడా దంపుడు బియ్యంలో తక్కువే. ఇక పోషకాల పరంగా చూస్తే- మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మలచటంలో కీలకపాత్ర పోషించే నియాసిన్‌, విటమిన్‌ బి3 వీటిల్లో చాలా ఎక్కువ. వీటిల్లోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది.


థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తికి, విశృంఖల కణాలను అడ్డుకోవటానికి తోడ్పడే సెలీనియం కూడా దంపుడు బియ్యంలో దండిగానే ఉంటుంది. వీటిల్లోని లిగ్నాన్లనే పాలీఫెనాల్స్‌ పేగుల్లోకి చేరిన తర్వాత ఫైటోఈస్ట్రోజన్‌ ఎంటెరోలాక్టేన్‌గానూ మారతాయి. ఇవి క్యాన్సర్‌ నివారకంగా పనిచేయటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ దోహదం చేస్తాయి. ఇక వీటిలోని పిండి పదార్థం నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందువల్ల రక్తంలో గ్లూకోజు స్థాయులు అంత త్వరగా పెరగవు. కడుపు నిండిన భావన కలిగించటం వల్ల వెంట వెంటనే ఆకలి వేయదు కూడా.


బ్రౌన్‌రైస్‌లో పీచు ఎక్కువ. ఇది గుండె కవాటాలు మూసుకుపోకుండా చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దాటిన మహిళల్లో ఈ సమస్యను రానివ్వదు. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి బరువూ అదుపులో ఉంటుంది.


ఈ బియ్యంలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ స్థాయులు తక్కువ. కాబట్టి తిన్న తరవాత చాలా ఆలస్యంగా జీర్ణమవుతాయి. అలా రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోజూ శరీరానికి అందడం వల్ల పెద్దపేగూ, రొమ్ము వంటి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా చాలా మటుకు తగ్గుతాయట.


ఈ బియ్యంలో ఉండే విటమిన్లూ, ఖనిజాలతోపాటూ ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని అందిస్తాయి. దాని వల్ల శరీరంలో పేరుకున్న ఫ్రీ రాడికల్స్‌నీ, వ్యర్థాలనూ బయటకు పంపిస్తాయి.  ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వార్థక్యపు ఛాయలు  కూడా త్వరగా దరిచేరవు.

No comments:

Post a Comment

Post Top Ad